
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.
అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ అవతరించిందని మంత్రి ఎంబీ రాజేష్, విద్యా మంత్రి శివన్‌కుట్టి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ చారిత్రక ప్రకటనను తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత పినరయి విజయన్ ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సతీశన్ కూడా హాజరవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు