
తిరుపతి, 25 అక్టోబర్ (హి.స.)
తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. మరొకరు మృతిచెందారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం అగ్రహారం గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఇసుక దిబ్బపై ఆడుతూ.. నీళ్లలో దూకుతూ సరదాగా గడిపారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో ప్రకాశ్ (17), మునిచంద్ర అలియాస్ చిన్న (15), తేజు (19), బాలు (16) కొట్టుకుపోగా.. కృష్ణ, విష్ణు, మునికృష్ణ్ణ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురిలో ఒకరు నది మధ్యలో చెట్టుని పట్టుకుని వేలాడుతుండగా.. అటువైపు వచ్చిన ఓ యువకుడు ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఇద్దరూ ఇసుక దిబ్బపై నిలబడి ఉన్నారని తెలిసింది. గల్లంతైన వారిలో బాలు మృతదేహం మాత్రం లభించింది. మిగతా ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ