
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో దీనికి మొంథా అని పేరు పెట్టే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లో వర్షాలు
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాల తీవ్రత కొనసాగుతుందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
అధికారుల అప్రమత్తత
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమన్నారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఉండకూడదని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV