
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీకి అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా ఇవాళ సాయంత్రం డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. డీసీసీల ఎంపికతో పాటు జూబ్లీహిల్స్ బై పోల్, స్థానిక సంస్థల ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. డీసీసీల ఎంపిక విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన 22 మంది ఏఐసీసీ పరిశీలకులు.. 35 డీసీసీ అధ్యక్షుల నియామకానికి మూడేసి పేర్ల చొప్పున జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. ఈ జాబితాపై ఇదిష్టానం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు