
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
ఉపాధి నిమిత్తం వివిధ దేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మన వారిని కాపాడుకోవడం మన ప్రభుత్వాల బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నయని, అలాంటి వారిని కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని విమర్శించారు. హరీశ్ రావు కృషితో జోర్డాన్లో చిక్కుకుపోయిన 12 మంది ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. వారంతా హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు 12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని, జోర్డాన్లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు అనేక సార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందుకే జోర్డాన్ లో చిక్కుకున్న12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బీఆర్ఎస్ పార్టీ 12 మంది కార్మికులను కాపాడి స్వదేశానికి తీసుకువచ్చామన్నారు.
రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు (Gulf Welfare Board) పెడతామని వాళ్లకోసం ప్రత్యక పాలసీ తెచ్చి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని రెండు సంవత్సరాలు అయినా రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మన రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్.. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ బిడ్డలను తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు