
కర్నూలు, 25 అక్టోబర్ (హి.స.)కర్నూలు (Kurnool) శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే, ఇదే ప్రమాదంపై తాజాగా టీడీపీ నేత, మాజీ ఎమెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏది ఏమైనా కర్నూలు బస్సు ప్రమాదం చాలా బాధకరమని అన్నారు. కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హుటాహుటిన తనిఖీలతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
గతంలో తమ ట్రావెల్స్ బస్సు కూడా ప్రమాదానికి గురైందని గుర్తు చేశారు. అప్పుడు కూడా చాలామంది ఎన్నో మాటలు అన్నారని.. అప్పటి ప్రభుత్వం తమపై కేసులు కూడా పెట్టిందని కామెంట్ చేశారు. బస్సులకు ఇన్సూరెన్స్, ట్యాక్స్‌లు దాదాపుగా ఉంటాయని.. గిట్టని వారు ఏదో అంటుంటారని అన్నారు. అయితే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలో సింగిల్ ట్యాక్స్ విధానం వద్దని తాను గతంలోనే చెప్పానని.. పాత ట్రాన్స్‌పోర్టు పద్ధతినే తిరిగి అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సింగిల్ ట్యాక్స్ విధానాన్ని ఎత్తేస్తే చాలా బస్సులు తగ్గిపోతాయని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV