
హాజీపూర్: ,25, అక్టోబర్ (హి.స.)
బీహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు.
జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ