
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)
కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా వీటిని అప్పగించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా ఇస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ.సిరి పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలు, మృతుల బంధువుల డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా అప్పగింత సాగుతోంది. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.
ఈ ప్రమాదంలో బస్సులోని 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో మరో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి చిత్తూరు నుంచి ఒకరు వచ్చారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తమ తండ్రి కనిపించడం లేదని ఆ వ్యక్తి చెప్పారన్నారు. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా ఆ మృతదేహం ఎవరిదనే విషయం తేలుతుందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని నివేదికలో తేలిందని ఎస్పీ చెప్పారు. (Andhra Pradesh News)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ