
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
ప్రఖ్యాత భూమి హక్కుల సంస్కర్త, న్యాయ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్ (భూమి సునీల్ )ను 'భూమి రత్న' పురస్కారం వరించింది. రైతుల భూమి హక్కులు, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సాధికారతకు గానూ ఆయన అందించే విస్తృత సేవలకు ఈ గౌరవం లభించింది. హైదరాబాద్లో రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో భూమి సునీల్ను సత్కరించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన సునీల్ కుమార్ గత 20 ఏళ్లుగా భూ సంస్కరణలు, గ్రామీణ చట్టపరమైన సాధికారత, వ్యవసాయ చట్టాలు, విధానాల రూపకల్పనలో విశేష సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ట్ర లీగల్ కో-ఆర్డినేటర్గా పనిచేసిన సమయంలో ఆయన నేతృత్వంలో అమలు చేసిన కమ్యూనిటీ పారా లీగల్ ప్రోగ్రాం ద్వారా 10 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు తమ భూములపై హక్కులు పొందగలిగాయి.
భూమి సునీల్ రూరల్ డెవెలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (ఆర్డీఐ) డైరెక్టర్గా పనిచేసిన సమయంలో రైతులకు న్యాయ అవగాహన పెంపొందించడం, భూమి పరిపాలనా వ్యవస్థల బలోపేతం, భూసంస్కరణ విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..