
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) కర్నూలు బస్సు ప్రమాద సంఘటనపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుందని ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి అని ప్రశ్నించారు.
వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు అని నిలదీశారు. సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండాలని హెచ్చరించారు. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారని, వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు