
కడప, 26 అక్టోబర్ (హి.స.)కడప జిల్లా మోరగుడి సమీపంలో వృద్ధ జంటను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. రోకలి బండతో తలలు పగలగొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగప్ప(60), ఓబులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, నాగప్ప గత ముప్పై సంవత్సరాలుగా పెద్దక్క అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీనికి ఓబులమ్మ ఆమోదం కూడా ఉన్నట్లు సమాచారం.
పిల్లలతో కలిసి ఓబులమ్మ జమ్మలమడుగులో నివాసం ఉంటున్నారు. నాగప్ప, పెద్దక్క తాడిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టీ నడుపుతూ అక్కడే ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇటుకల బట్టీ వద్ద నిర్మించుకున్న గదిలో నిద్రిస్తున్న నాగప్ప, పెద్దక్కలను దుండగులు రోకలి బండతో తలలు పగలగొట్టి హతమార్చారు. పక్క గదిలోని బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యలు దోపిడీదొంగల పనా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV