
ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.)
: వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్న భద్రతా దళాలు ఈ సంవత్సరం ఇప్పటివరకూ 270 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకూ 680 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా.. మరో 1,225 మంది లొంగిపోయినట్లు హోంశాఖ తెలిపింది. భద్రతాదళాలు పూర్తి సమన్వయంతో చేపడుతున్న నక్సలిజం వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 2004-14 మధ్యకాలంతో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో దేశంలో మావోయిస్టుల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలు 53%, నక్సల్ హింసలో భద్రతా సిబ్బంది మరణాలు 73%, పౌర మరణాలు 70% తగ్గినట్లు వెల్లడించింది. గత దశాబ్దకాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 576 పోలీస్‌స్టేషన్లు నిర్మించినట్లు పేర్కొంది. 336 కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. రాత్రిపూట హెలికాప్టర్‌లు దిగేందుకు వీలుగా 68 హెలిప్యాడ్‌లు నిర్మించడం వల్ల భద్రతా దళాల తరలింపు వేగవంతం కావడంతోపాటు, మరింత ప్రభావవంతంగా మావోయిస్టు వ్యతిరేక చర్యలు చేపట్ట గలిగామని వివరించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ