
రాజన్న సిరిసిల్ల, 27 అక్టోబర్ (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సోమవారం తంగళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యా ప్రమాణాలు, పోషకాహారం, పరిశుభ్రత వంటి అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం గుడ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలను తనిఖీ చేశారు.
తర్వాత 9వ తరగతి విద్యార్థులకు 'ఫోటోసింథసిస్’ పాఠాన్ని స్వయంగా బోధించి, పెద్ద లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి ముందుకు సాగాలని ప్రోత్సాహం అందించారు. విద్యార్థుల కలలు సాకారం కావడానికి జిల్లా పరిపాలన నుంచి పూర్తి మద్దతు అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ గరిమ అగర్వాల్ ఈ పర్యటనతో విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు