
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
అబ్దుల్లాపూర్మెట్లో సోమవారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ టవర్పైకి ఎక్కి ఉద్రిక్తతకు కారణమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు, అబ్దుల్లాపూర్మెట్-హయత్నగర్ రోడ్ సమీపంలో ఉన్న విద్యుత్ టవర్ పై ఆ వ్యక్తి ఎక్కి కూర్చోవడంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఆందోళన నెలకొంది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే కరెంట్ సరఫరా నిలిపివేసి, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అతన్ని కిందకు దింపేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టవర్ పై ఉన్న వ్యక్తి ఎటువంటి డిమాండ్లు చేస్తున్నాడో, లేదా మానసిక సమస్యలతో ఇలాచేశాడో తెలియరాలేదు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరడంతో అక్కడ జనసందోహం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచి, అతన్ని సురక్షితంగా కిందకు దింపేందుకు చర్యలు చేపడుతున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..