
అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కొనుగోలుకు మద్ధతు ధరను (MSP) ప్రకటించింది. క్వింటాలుకు రూ.8,110గా ధరను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీసీఐ (CCI) కొనుగోలు కేంద్రాలకు పత్తి పెద్ద ఎత్తున విక్రయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 11 జిల్లాలోని 29 మార్కెట్ యార్డుల పరిధిలో 30 కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడకుండా వెంటనే పత్తిని అమ్ముకొని వెళ్లేలా కొత్త విధానాన్ని సీసీఐ అమలులోకి తీసుకొచ్చింది. పత్తి రైతులకు మేలు చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు రైతులు తమ స్మార్ట్ ఫోనులో కపాస్ కిసాన్ (Kapas Kisan) అనే యాప్ ను ప్లే స్టోరు నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి సదరు యాప్ ద్వారా టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా టైం స్లాట్ బుక్ అవుతుంది. ఆ టైం ప్రకారం సీసీఐ కొనుగోలు కేంద్రానికి వెళ్లడం ద్వారా పత్తి రైతు ఎక్కువ సమయం ఎదురు చూడకుండా పత్తిని అమ్ముకునేందుకు సీసీఐ వీలు కల్పించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV