
కర్ణాటక, 28 అక్టోబర్ (హి.స.)
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి
హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ ప్రాంగణాలు, స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ భూములపై ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు శిబిరాలు లేదా కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యకలాపాలు నిర్వహించే ముందు ఏ ప్రైవేట్ సంస్థైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి.
దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ పునశ్చైతన్య సేవా సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్, జస్టిస్ నాగప్రసన్న సింగిల్ జడ్జి బెంచ్గా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించింది. అలాగే తదుపరి విచారణను నవంబర్ 17 కి వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ తీర్పు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు ఊరటగా మారగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇది కేవలం పరిపాలనా చర్య అని వివరిస్తుంది. కాగా కోర్టు తీర్పును కర్ణాటక బీజేపీ నేతలు స్వాగతించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు