
విజయవాడ, 28 అక్టోబర్ (హి.స.)
: విజయవాడ కేంద్రంగా నాలుగు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన అద్విక ట్రేడింగ్ మార్కెటింగ్ కంపెనీ మోసం కేసులో ప్రధాన నిందితులైన భార్యభర్తలతోపాటు వారికి సహకరించిన ఇద్దరు కీలక ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్ 26న బాధితుడు గణేష్‌చంద్ర, అతడి కుటుంబ సభ్యులు మాచవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేల మంది బాధితులు కావడం.. నష్టపోయిన మొత్తం రూ.140 కోట్ల వరకు ఉండడంతో లోతైన దర్యాప్తు కోసం విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు ప్రత్యేక బృందాలను నియమించారు. అద్విక ట్రేడింగ్ కంపెనీ వ్యవస్థాపకులు తాడేపల్లి ఆదిత్య మాటలు నమ్మి రూ.53 లక్షలు డిపాజిట్ చేసినట్లు గణేష్‌చంద్ర పోలీసులకు తెలిపారు. తనకు తిరిగి రూ.13 లక్షలు ఇచ్చి కంపెనీ మూసివేశారని.. న్యాయం చేయాలని కోరడంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో సంస్థ ఎండీ ఆదిత్య, అతడి భార్య సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. ఏజెంట్లు బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మిదేవిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో బాధితులు 1,355 మంది వరకు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ