
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న కన్న బిడ్డ విక్రయ ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జరిగిన ఉదంతం పై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా లను ఆదేశించారు. పిల్లల అమ్మకాలు, అక్రమ దత్తతపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధకరమని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
విక్రయానికి పెట్టిన శిశువును వెంటనే సంరక్షణలోకి తీసుకుని తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకోవాలని, ఈ విషయంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లీబిడ్డల సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. పేదరికం, అజ్ఞానం లాంటి కారణాలతో ఇలాంటి దారుణాలు జరగడం మనసుకు ఎంతగానో బాధ కలిగిస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ, సంరక్షణ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. సమాజం కూడా ఇలాంటి అన్యాయాలను నిరోధించడానికి ముందుకు రావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..