
తెలంగాణ, 28 అక్టోబర్ (హి.స.)
'మొంథా' తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర
వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం సచివాలయంలో 'రైతు నేస్తం' కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మంత్రి తుమ్మల మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పత్తి తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని తాము కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ (CCI) ద్వారా 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లకు ప్రారంభించామని అన్నారు.
కాగా, నిన్న 72 జిన్నింగ్ మిల్లులలో 784 మంది రైతులకు చెందిన 1,623 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశామని తెలిపారు. పత్తి క్వింటాలు మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు