
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)అమరావతిలో (Amaravati) ఏర్పడనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ బుల్లెట్ రైలును అభివృద్ధి చేయాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
చెన్నై-బెంగళూరు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ తిరుపతి మీదుగా వెళ్లేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఏపీలో రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి (Infrastructure Development) లక్ష్యంగా రైల్వే ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోర్టు ప్రాంతాలకు రైల్వే లైన్ అనుసంధానం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, రామాయపట్నం వంటి నూతన పోర్టులను (Ports) రైల్వే నెట్వర్క్‌తో కలుపుతూ కనెక్టివిటీని బలోపేతం చేయాలన్నారు. తూర్పు, పశ్చిమ దిశల్లో రైల్వే కనెక్టివిటీ విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మార్గాల్లో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ (High Speed Elevated Corridors) ప్రతిపాదనలపై కూడా సమీక్షించారు. రైల్వే శాఖ ప్రతిపాదించిన అమరావతి, గన్నవరంలో కొత్త టెర్మినళ్ల నిర్మాణానికి భూమి కేటాయించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించనున్న అమరావతి స్టేషన్ వినూత్న రూపంలో ఉండాలన్నారు. అమృత్ భారత్ పథకం (Amrith Bharat Scheme) కింద జరుగుతున్న పనులన్నీడిసెంబరు లోపల పూర్తయ్యేలా చూడాలన్నారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV