
న్యూఢిల్లీ:, 28 అక్టోబర్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెను సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమంగా వర్షాలను కురిపించేందుకు సిద్ధమయ్యింది. శీతాకాలంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి అనంతరం పొగ, దుమ్ము, పొగమంచు కలగలిసి ఢిల్లీని గ్యాస్ చాంబర్ మాదిరిగా మార్చాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) పరిష్కారం చూపనుంది.
వాతావరణం అనుకూలిస్తే..
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఢిల్లీ ప్రభుత్వం నేడు (మంగళవారం)తొలి క్లౌడ్ సీడింగ్ ట్రయల్‌ను నిర్వహించనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించే ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మీడియా సంస్థ పీటిఐకి తెలిపారు. ఈ ప్రయోగానికి ఉపకరించే విమానం కాన్పూర్ నుండి ఢిల్లీకి చేరుకుంటుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి సన్నాహాలు ఇప్పుటికే పూర్తయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు