
ఢిల్లీ,, 28 అక్టోబర్ (హి.స.)బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. బీహారీయులు తిరిగి పనుల నిమిత్తం బయట రాష్ట్రాలకు వెళ్లిపోకుండా పార్టీలు పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే మంగళవారం మహాఘటబంధన్ మేనిఫెస్టో విడుదల కానుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాట్నాలో మేనిఫెస్టో విడుదల చేసి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ అంతటా ర్యాలీలు, బహిరంగ సమావేశాలను ప్రారంభించనున్నారు.
ఇక మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అనే హామీ ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యమేనని తెలిపారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఈ హామీ ఉండొచ్చని సమాచారం. అలాగే వృద్ధాప్య పింఛన్‌ను కూడా పెంచొచ్చని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ