
బెంగళూరు: కన్నడ కాంగ్రెస్ పార్టీలో సీఎం ఆట జోరందుకుంది. సీఎం కుర్చీ కోసం నాయకులు ఆశల పందిళ్లలో ఊరేగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లను.. వెళ్లను అంటూనే ఆదివారం మధ్యాహ్నం హస్తినకు పయనమయ్యారు. అయితే హైకమాండ్ నాయకులు బిజీగా ఉండడంతో డీకే శివకుమార్ వారినెవరినీ కలవకుండానే రిక్తహస్తాలతో బెంగళూరుకు తిరిగి వచ్చేశారు. మిగిలిన ఇతర నాయకులు కూడా హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. డీకేకి పోటీగా, దళిత సీఎం అనే కొత్త రాగాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు అందుకున్నారు.
డీకే వ్యతిరేకుల కూటమి
సీఎం సిద్ధరామయ్య తర్వాత ఎవరు ఆయన వారసుడంటూ జోరుగా చర్చ సాగుతున్న తరుణంలో దళిత నేతే తదుపరి ముఖ్యమంత్రి కావాలని పలువురు నేతలు కోరుతున్నారు. హోం మంత్రి జి.పరమేశ్వర్ పేరు వినిపిస్తోంది. మంత్రి కేహెచ్ మునియప్ప సీఎం అయితే స్వాగతిస్తానని పరమేశ్వర్ చెప్పారు. వీరికి మంత్రి సతీశ్ జార్కిహొళి మద్దతు ప్రకటించారు. దళిత నేత ముఖ్యమంత్రి కావడం మంచిదే అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు