
జైపూర్, 28 అక్టోబర్ (హి.స.)కర్నూల్ చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు ప్రమాదం తర్వాత.. వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా మరో ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్నిప్రమాదానికి గురై.. పూర్తిగా దగ్ధమవ్వగా ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం రాజస్థాన్ లో జరిగింది.
ఈ రోజు మంగళవారం ఉదయం జైపూర్ జిల్లా షాపురా సబ్ డివిజన్ లోని మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైపూర్ - ఢిల్లీ రహదారి పక్కనే ఈ ప్రమాదం జరిగింది. తోడి గ్రామంలోని ఇటుక బట్టీకి కార్మికులతో ప్రయాణిస్తున్న బస్సు 11 కేవీ హై ఓల్టేజీ వైర్లను తాకింది. బస్సు పైకప్పుపై భారీగా లగేజీ ఉండటంతో.. క్షణాల్లోనే మంటలు వాటికి వ్యాపించాయి. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు దిగేసరికే మంటలు చుట్టుముట్టడంతో ముగ్గురు మరణించగా.. మరో 12 మందికి కాలిన గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్ నుంచి తోడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్మికుల కేకలు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని షాపురా సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఐదుగురు కార్మికుల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జైపూర్ కు రిఫర్ చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేసరికే బస్సు పూర్తిగా దగ్ధమయింది. మృతదేహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి పంపారు. కాగా.. టోల్ రుసుము తప్పించుకునేందుకు డ్రైవర్ విలేజ్ లోకి వెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధన కారణమని తెలుస్తోంది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV