
విజయవాడ, 28 అక్టోబర్ (హి.స.) మొంథా తుఫాను విజయవాడ ప్రజలను వణికిస్తోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం మార్కెట్లకు పోటెత్తడంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. రాబోయే మూడు రోజులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదనే ఆందోళనతో జనం భారీగా కొనుగోళ్లు చేస్తుండటంతో పలు మార్కెట్లు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి.
కృష్ణా జిల్లా కలెక్టర్ మూడు రోజుల పాటు తుపాను హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా పాలు, మందులతో పాటు కూరగాయలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా, పటమట రైతు బజార్‌లో జనం రద్దీ పెరిగి, కొన్ని గంటల్లోనే కూరగాయలు మొత్తం అమ్ముడుపోయాయి. చాలామంది కూరగాయలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ధరలు కూడా అమాంతం పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో టమాటా ధర రూ. 38, పచ్చిమిర్చి రూ. 45, క్యారెట్ రూ. 70, బీట్‌రూట్ రూ. 45 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయని, ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV