
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుండి మొదలైన వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. నల్లటి మబ్బులతో కొద్ది సేపు భారీగా మరికొంత సమయం ముసురుగా నగరం మొత్తం వర్షం కురుస్తుండడంతో ప్రజలు పనుల నిమిత్తం బయటకు వచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, అమీర్ పేట్, కోఠి, ఎల్బీ నగర్, మలక్ పేట్, చాదర్ ఘాట్, పాతబస్తీ, దిల్ సుఖ్ నగర్, బేగంపేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో ఒక చోట ఉండి, మరోచోట లేదనకుండా భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావడంతో వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం బయటకు వచ్చిన వారు గమ్యం చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆర్టీసీ సైతం బస్సుల సంఖ్య తగ్గించగా మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో తుపాను ఎదుర్కోవడానికి రైల్వేలు తీసుకుంటున్న వివిధ చర్యలపై జీఎం సమీక్షించారు. తుపాను ప్రభావం హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే బస్సులు, రైలు సర్వీసులపై పడింది. తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో ఏపీకి వెళ్లే 30 కి పైగా బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. ఇదిలా ఉండగా కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..