
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)
మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్ అండ్ బీ అధికారులు ఫీల్డ్ లెవెల్లో హై అలర్ట్ ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే తప్ప.. అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దని సూచించారు. మాన్సూన్ సీజన్లో ఎలాగైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామో.. భారీ వర్షాలు కురుస్తుండటం అదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పీఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. కాజ్ వేలు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఎమర్జెన్సీ అయితేనే ప్రజలు రోడ్లపైకి రావాలి.. అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..