అనంతపురం, 5 అక్టోబర్ (హి.స.) అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Sandhya Rani) ఆదేశాలు జారీ చేశారు.
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ చనిపోయారనే వార్తలపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాల కారణంగా బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుకుం జారీ చేశారు మంత్రి సంధ్యారాణి.
పసిబిడ్డ మృతికి ఆనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శిశువు మరణానికి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించబోమని మంత్రి సంధ్యారాణి వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV