న్యూఢిల్లీ, 7 అక్టోబర్ (హి.స.)
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది. సీఎం అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన దాదాపు ఏడాది తర్వాత ఆయనకు కేంద్రం అధికారిక బంగ్లాను కేటాయించింది. 95, లోధి ఎస్టేట్లోని టైప్ 7 బంగ్లాను కేటాయించింది. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో నివసించిన లోధి ఎస్టేట్ లోని బంగ్లాను కేజ్రివాల్ కు కేటాయించాలని ఆప్ కోరింది. కానీ ఆ బంగ్లాను జూన్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించడంతో..కేజ్రివాల్ కు వేరే బంగ్లా అలాట్ చేశారు.
2024 అక్టోబర్లో ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలిగిన అరవింద్ కేజ్రివాల్ , ఫ్లాగ్జాఫ్ రోడ్లోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. నాటి నుంచి మండి హౌస్ సమీపంలోని మరో పార్టీ సభ్యుడి అధికారిక గృహంలో ఆయన నివసిస్తున్నారు. ఈ క్రమంలో తనకు అధికారిక బంగ్లా కేటాయించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారిక బంగ్లాను కేటాయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు