చెన్నై ,07 అక్టోబర్ (హి.స.) తమిళ అగ్రనటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ ఘటనలో స్టాలిన్ ప్రభుత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై భగ్గుమన్నారు.
రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్‌పై మండిపడ్డారు. ‘‘కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని అన్నామలై అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు