ముంబై,07,అక్టోబర్ (హి.స.) టాటా ట్రస్ట్స్‌కు దశాబ్దాల పాటు రతన్ టాటా ఛైర్మన్‌గా వ్యవహరించారు. టాటా ట్రస్ట్స్‌కు, గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్‌కు మధ్య చక్కని సమన్వయం కుదిర్చారు. ఆయన సమున్నత వ్యక్తిత్వం కూడా ఇందుకు ఉపకరించింది. రతన్ టాటా మరణించాక అంతలా వ్యక్తిగత ప్రభావం చూపేవారు టాటా గ్రూప్‌లో కరవైనట్లున్నారు. దేశంలోనే అత్యంత విలువైన ఈ గ్రూప్‌లో ఆధిపత్య పోరు మొదలైనట్లు చెబుతున్నారు. అందుకే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి వస్తోందనీ వార్తలొస్తున్నాయి.
రతన్ టాటా మరణానంతరం గతేడాది అక్టోబరులో టాటా ట్రస్ట్స్‌కు నోయల్ టాటా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అంతకుముందు టాటా సన్స్‌లో రతన్ తీసుకున్న ఏ నిర్ణయానికీ ట్రస్టీలు కానీ, నామినీ డైరెక్టర్లు కానీ అడ్డుతగిలే, సవాలు చేసే పరిస్థితి లేదు. రతన్ స్థానంలో పగ్గాలు చేపట్టిన నోయల్, అదే స్థాయిలో అధికారాన్ని చెలాయించలేకపోతున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. టాటా ఇంటిపేరున్న నోయల్ ఎంపికను ఎవరూ అడ్డుకోకపోయినా, నోయల్ చేసే ప్రతి పనినీ ట్రస్టీలు భూతద్దంలో చూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఒక ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించారు కూడా. టాటా సన్స్‌లో వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి ఈయనకు అనుబంధం ఉంది.
9
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు