హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని నాకు ఎలాంటి గ్రూపుల్లేవు అని నాది బీజేపీ గ్రూపు అని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీ అభ్యర్థికి కాకుండా ఇతరుల కోసం పనిచేస్తూ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తే అలాంటి వారు కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనన్నారు. అంతకంటే నీచమైన వంచన ఇంకోటి ఉండదని చెప్పారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్గా తీసుకోవాలన్నారు. ఆయా నేతలు నివసించే గ్రామాలు, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆయా నాయకులకు పలుకుపడి ఉంటుందని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వాళ్లను గెలిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు