ఢిల్లీ, 9 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్‌పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అనూహ్య పరిణామం నేపథ్యంలో, న్యాయవాది రాకేష్ కిషోర్‌పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆయన తాత్కాలిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనను ఎస్‌సీబీఏ తీవ్రంగా పరిగణించింది. రాకేష్ కిషోర్ తాత్కాలిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నామని, అసోసియేషన్ సభ్యుల జాబితా నుంచి ఆయన పేరును తొలగిస్తున్నామని ఎస్‌సీబీఏ ఓ తీర్మానంలో స్పష్టం చేసింది. ఈ మేరకు లైవ్ లా నివేదించింది.
ఇదిలా ఉండగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కూడా రాకేష్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కారణ చర్యలు చేపట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. 71 ఏళ్ల రాకేష్ కిషోర్‌పై చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్‌కు ఇప్పటికే ఓ లేఖ పంపినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV