అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కీలక శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రదర్శించిన బలమైన నాయకత్వానికి నిదర్శనమని మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో ఒక పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళికలోని మొదటి దశ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా గాజాలో బందీలుగా ఉన్నవారి విడుదలతో పాటు, అక్కడి ప్రజలకు మానవతా సాయం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ పరిణామాలు యుద్ధంతో అతలాకుతలమైన గాజా ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థాపనకు ఈ ఒప్పందం ఒక మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. తన పోస్టులో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను ట్యాగ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV