
కర్నూలు, 10 నవంబర్ (హి.స.)శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన దివ్య చరిత్ర, భవిష్యత్ కాలజ్ఞానం తెలుగు ప్రజల జీవితంలో అంతర్భాగంగా నిలిచిపోయాయి. ఆయన ఎనిమిదో తరం వారసుడైన వీరభట్లయ్య స్వామి.. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎన్నో అద్భుతమైన విషయాలను వెల్లడించారు.
వీరభట్లయ్య స్వామి తెలిపిన ప్రకారం… వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వద్ద ఒక అద్భుతమైన దివ్యశక్తి ఉంటుందని, ఎవరు దర్శనానికి వెళ్లినా మంచి జరుగుతుందని చాలా మందికి అనుభవమట. దీనికి నిదర్శనంగా ఆయన ఒక విదేశీ యువతి గురించి వివరించారు. ఇటలీ నుంచి వచ్చిన ఇలిష్కా అనే యువతి, బ్రహ్మం గారి గురించి విని మఠానికి వచ్చి పది నుంచి ఇరవై రోజులు అక్కడే గడిపిందట. ప్రతిరోజూ ధ్యానం చేసుకునే ఆమెకు మూడవ రోజున స్వామివారు దర్శనమిచ్చారని.. పాలు, పండ్లతో మూడు రోజులు ఉపవాసం ఉండమని ఆదేశించారని చెప్పారు. ఆమెకు కలలో పింక్ రంగులో, తేజస్సుతో, చక్కని గడ్డం, వెంట్రుకలతో స్వామి కనిపించగా, ఒక చిత్రకారిణి అయిన ఆమె ఆ రూపాన్ని చిత్రించి చూపగా, అది నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి రూపమే అని ధృవీకరించారట. ఈ అనుభవం ఆ యువతిలో స్వామివారిపై అపారమైన భక్తిని పెంచిందని వీరభట్లయ్య స్వామి పేర్కొన్నారు.
విదేశీయురాలు మన హిందూ సంప్రదాయాన్ని పాటించి, స్వామివారి దివ్యశక్తిని అనుభవించడం గొప్ప విషయం అని వీరభట్లయ్య స్వామి చెప్పారు. మఠం వద్ద జరిగిన మరో అద్భుతం రాత్రిపూట గంటలు మోగడం. మధ్యాహ్నం 12:30 నుంచి 1:00 గంటల మధ్యలో స్వామివారికి పూజ, మహానైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. గతంలో రాత్రి 1:00 లేదా 1:30 గంటల సమయంలో అదే గంటల శబ్దం వినిపించేదట. ఆ సమయంలో తలుపులు తీసినా తెరచుకునేవి కాదని, పూజ తర్వాతే తెరుచుకునేవని స్థానికులు, వీరభట్లయ్య స్వామి తాతగారు, నాన్నగారు చెప్పేవారట. తలుపులు తెరుచుకున్న తర్వాత తడి పాదాలు కనబడేవని, అంటే పక్కనే ఉన్న కొండలో తపస్సు చేసుకునే రుషులు రాత్రిపూట బ్రహ్మం గారికి పూజ చేసేవారని భక్తులు నమ్ముతారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధిలో వెలిగే దీపం విశేషం. ఆయన జీవసమాధి అయ్యేటప్పుడు స్వయంగా వెలిగించిన దీపం అది. అప్పటి నుంచి నేటికీ ఆ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది.
ప్రతిరోజూ దానికి నూనె, వత్తులు మారుస్తున్నప్పటికీ, ఆ వెలుగు స్వామివారి దివ్యజ్యోతిగా భావిస్తారు. ఈ దీపం భవిష్యత్తులో కరెంటు వస్తుందని, విద్యుత్ దీపాలు ఉంటాయని స్వామివారు ఆనాడే సూచించారని వీరభట్లయ్య స్వామి తెలియజేశారు. ఈ జ్యోతి కాటుకను ఆరోగ్య సమస్యల నివారణకు భక్తులు ఉపయోగిస్తారు. స్వామివారి జీవసమాధి ఒక అరుదైన విషయం. ఆయన జీవంతో ఉండగానే సమాధి అయ్యారు కాబట్టే ఆయన సతీమణికి పసుపు కుంకుమలు తీయకూడదని చెప్పారని, నేటికీ ఆయన సమాధిలో జీవంతో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.
ఒకసారి, బ్రహ్మం గారి మూడవ కుమారుడు పోతులూరి స్వామి, తన తల్లి పసుపు కుంకుమలు తీయకపోవడం హిందూ సంప్రదాయానికి విరుద్ధమని భావించి, కోపంతో సమాధిని తెరిపించారట. లోపల స్వామివారు తపస్సు చేసుకుంటూ కనిపించగా, పుత్రుడు కాబట్టి శాపం పెట్టి వదిలివేశారని, వేరొకరైతే భస్మమై ఉండేవారని చెప్పి, ఆ శాపం వల్ల పోతులూరి స్వామి పద్నాలుగు సంవత్సరాలు కఠోర తపస్సు చేసి చివరకు బ్రహ్మం గారి సమాధి ఎదురుగా జీవసమాధి అయ్యారని వీరభట్లయ్య స్వామి వివరించారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం విశేషమైనది. ఆయన మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథాల కాలజ్ఞానాన్ని రాశారని చెబుతారు.
అందులో ఇప్పటివరకు కొంత మాత్రమే జరిగిందని, ఇంకా చాలా జరగాల్సి ఉందని వీరభట్లయ్య స్వామి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి గురించి ఆయన ముందే ఊహించి, “ఈశాన్యమందు విషగాలి వచ్చి విపరీత జనం చచ్చేను” అని రాశారట. ఈశాన్యం అంటే చైనా, విషగాలి అంటే వైరస్ అని వ్యాఖ్యానించారు. అలాగే, భూకంపాలు, సునామీలు వస్తాయని కూడా చెప్పారు. 2005లో లాతూర్, మహారాష్ట్రలో వచ్చిన భూకంపం గురించి ఆయన “భాద్రపద మాసం మందార వారమున శనివారమున నాలుగు 15 నిమిషములకు నాలుగు పక్కల నాలుగు ఊర్లు అదిరినవి” అని కచ్చితంగా మాసం, వారం, తేదీ, సమయంతో సహా రాశారని వీరభట్లయ్య స్వామి ఉదాహరించారు. ఆయన మళ్లీ వీర వసంత రాయలుగా పుడతారని, అప్పుడు యాగంటి బసవయ్య రంకె వేస్తుందని, తెల్ల కాకి పుడుతుందని చెప్పిన సూచనలు కూడా నిజమయ్యాయి. ఇవన్నీ స్వామివారి అసాధారణ దార్శనికతకు నిదర్శనం. అటువంటి మహనీయుడు భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రలో పుట్టడం తెలుగు ప్రజల అదృష్టమని వీరభట్లయ్య స్వామి అన్నారు. ఆయన వంశంలో పుట్టడం తమకు పుణ్య సుకృతమని, ఆయన గురించి చెప్పే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV