
అమరావతి, 17 నవంబర్ (హి.స.)డిగ్రీ అడ్మిషన్లలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రెండు నెలల కిందట విద్యా సంవత్సరం ప్రారంభమైతే.. ఉన్నత విద్యామండలి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఎట్టకేలకు షెడ్యూలు జారీచేసింది. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 28తో ముగుస్తుంది. మరోవైపు కన్వీనర్ కోటాలో మూడో విడత సీట్ల కేటాయింపు కొద్ది రోజుల కిందటే ముగిసింది. సెమిస్టర్-1 పరీక్షలు సమీపిస్తున్నా.. ఇంకా అడ్మిషన్లు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇంకెప్పుడు చదువుతారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెప్టెంబరు 18న డిగ్రీ తరగతులు ప్రారంభం కాగా.. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ అయ్యే నాటికి రెండు నెలలకు పైగా తరగతులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత మొదటి సెమిస్టర్ పరీక్షలకు నెలన్నర సమయమే ఉంటుంది. ఇప్పటివరకూ మూడో విడతల్లో 1.6 లక్షల వరకు సీట్లు భర్తీ అయ్యాయని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నా, అధికారికంగా గణాంకాలు విడుదల చేయలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ