
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.) డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని 42శాతం బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. బీసీ వర్గాల న్యాయపరమైన హక్కైన 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధం చేయకుండా ఎన్నికలు జరపడం అంటే బీసీలను మరోసారి మోసం చేయడమేనని, బీసీలను రాజకీయంగా ఎదగకుండా నిరోధించే కుట్రగా ఈ నిర్ణయాన్ని భావిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ బీసీ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రధాన మంత్రితో భేటీకి అపాయింట్మెంట్ తక్షణమే పొందాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ఆమోదం తీసుకురావడం 9వ షెడ్యూల్ లో చేర్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. ఇది కేవలం రాజకీయ హామీ కాదని ఇది బీసీ వర్గాల రాజ్యాంగ బద్ధమైన హక్కును రక్షించే పరీక్ష అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు