
గుజరాత్, 18 నవంబర్ (హి.స.)
గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి
జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ లో మంటలు చెలరేగి నవజాత శిశువు, డాక్టర్, నర్సుతో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం
ఒక్కరోజు వయసు గల నవజాత శిశువుకు మెరుగైన చికిత్స కోసం మొదాస నుంచి అహ్మదాబాద్కు తరలించే సమయంలో ఒంటి గంట ప్రాంతంలో అంబులెన్స్ వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే వాహనాన్ని ఆపిన డ్రైవర్ అంకిత్ ఠాకూర్తో పాటు ముందుభాగంలో ఉన్న గౌరంగ్ మోచీ, గీతాబెన్ మోచీ గాయాలపాలయ్యారు. అయితే వెనుక భాగంలో ఉన్న శిశువు, తండ్రి జిగ్నేష్ మోచీ (38), డాక్టర్ శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మానత్ (23) అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాద కారణాలపై ఫోరెన్సిక్ నిపుణులతో ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ మనోహర్సిన్హ్ జడేజా తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..