
విశాఖపట్నం, 18 నవంబర్ (హి.స.)
‘విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైకాపా రాజకీయం చేస్తోంది. భాగస్వామ్య సదస్సు విజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌కు ఢోకా లేదు. దాని పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఇచ్చింది. కష్టకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ సహకరించాలి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వైకాపా నాయకులకు రాళ్లు వేయడం అలవాటుగా మారింది’ అని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు చరిత్ర సృష్టించిందని, గూగుల్ రాకతో రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందన్నారు. జగన్ పాలనలో మంచి పరిశ్రమ ఒక్కటైనా కార్యకలాపాలను ప్రారంభించిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని గంటా సవాలు విసిరారు. జగన్‌కు పారిశ్రామికవేత్తలంటే ఎలర్జీ అని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ