
అమరావతి, 19 నవంబర్ (హి.స.)అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 20న(గురువారం) హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలంగా బెయిల్‌పైనే ఉన్న ఆయన ఇటీవల కోర్టు ఆదేశాలతో న్యాయస్థానం మెట్లు ఎక్కనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 2020, జనవరి 10న విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ‘అధికార హోదా’ను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రిగా తనకు భద్రత అవసరమని.. పాలనా బాధ్యతల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ అపట్లో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందారు. 2024, సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకాకుండా వాయిదాలు వేయించుకునే ప్రయత్నాలు చేశారు.
అయితే.. జగన్ లండన్ వెళ్లిన సమయంలో ఫోన్ నంబరు తప్పుగా ఇవ్వడంతో.. జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సీఎం హోదాలో ఉన్నానని.. తనకు భద్రత అవసరమంటూ జగన్ సాకులు చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్షనేత హోదా లేదు. వైసీపీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి సాకులూ చూపలేని పరిస్థితి ఎదురైంది. కోర్టు కూడా ఈ నెల 21లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ