
అమరావతి, 21 నవంబర్ (హి.స.) మత్స్యకారులు–ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకొని గంగపుత్రులందరికీ శుభాకాంక్షలను తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మత్స్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే కాక, ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత ఈ మూడు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే చర్యల ద్వారానే నీలి విప్లవం నిజస్వరూపం దాల్చుతుందన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పురోగమించేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకుని, వేట నిషేధకాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 భృతిని కూటమి ప్రభుత్వం రూ.20,000కు పెంచినట్లు మంత్రి తెలిపారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.259 కోట్ల ఆర్థిక లాభం కల్పించామని పేర్కొన్నారు. కేవలం వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం ఇవ్వడం మాత్రమే కాకుండా, వలసలు వెళ్లే మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV