'గుర్తుందా ప్రధాని గారూ?'.. రూపాయి పతనంపై కాంగ్రెస్ సెటైర్
న్యూఢిల్లీ, 24 నవంబర్ (హి.స.)డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోతుండటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మలుచుకుంది. రూపాయి విలువ దాదాపు 90కి చేరువ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. 2
H


న్యూఢిల్లీ, 24 నవంబర్ (హి.స.)డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోతుండటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మలుచుకుంది. రూపాయి విలువ దాదాపు 90కి చేరువ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు.

సోమవారం కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. రూపాయి స్వేచ్ఛా పతనం కొనసాగుతోంది. త్వరలోనే డాలర్‌తో పోలిస్తే 90 మార్కును దాటేలా ఉంది. 2013 జులైలో ప్రధాని ఏం మాట్లాడారో ఆయనకు గుర్తుందా? అని ప్రశ్నిస్తూ, ఆనాటి వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం, రూపాయి మధ్య పోటీ నడుస్తున్నట్లుంది. ఎవరి గౌరవం వేగంగా పడిపోతుందో చూడాలి అని అప్పట్లో మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ గుర్తుచేసింది.

శుక్రవారం ఒక్కరోజే రూపాయి విలువ 98 పైసలు పతనమై, డాలర్‌తో 89.66 వద్ద జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గత మూడేళ్లలో ఇదే అతిపెద్ద పతనం కావడం గమనార్హం. అయితే, సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి కాస్త కోలుకుని, 49 పైసలు లాభపడి 89.17 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు 2022 ఫిబ్రవరి 24న రూపాయి ఒకేరోజు 99 పైసలు నష్టపోయింది. రూపాయి విలువ క్షీణిస్తున్న తరుణంలో కాంగ్రెస్ చేస్తున్న ఈ విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande