
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
అయోధ్య: 25,నవంబర్ (హి.స.)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం (Dhwajarohan at Ayodhya) జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7వేల మంది ప్రత్యక్షంగా తిలకించారు. గతేడాది జనవరి 22న ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే.
ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయవర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ