
ఢిల్లీ, 24 నవంబర్ (హి.స.)భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ సూర్యకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్' లో పేర్కొన్నారు.
అనేక చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయిన జస్టిస్ సూర్యకాంత్, ఇటీవలి సంప్రదాయానికి భిన్నంగా దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు, హర్యానా ముఖ్యమంత్రి నాయిబ్ సింగ్ సైనీ హాజరయ్యారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భూటాన్, కెన్యా, మలేషియా, బ్రెజిల్, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు.
జస్టిస్ సూర్యకాంత్ సుమారు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ సిఫార్సు చేయగా, అక్టోబర్ 30న కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV