
ముంబై, 26 నవంబర్ (హి.స.)భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయింది. 2008, నవంబర్ 26న జరిగి ఈ దాడి ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన ఈ మారణహోమం, దేశ వాణిజ్య రాజధాని ముంబైని నాలుగు రోజుల పాటు భీతావహ వాతావరణంలోకి నెట్టింది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు, భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ రోజున ఆ దాడిలో అసువులు బాసిన వీరులకు, సాధారణ పౌరులకు యావత్ దేశం నివాళులు అర్పిస్తోంది.
దాడి ఎలా చేశారంటే..?
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్ సహా పది మంది ముష్కరులు కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం గుండా పడవలో ముంబై లోకి చొరబడ్డారు. వీరు అత్యంత వ్యూహాత్మకంగా నగరంలోని ముఖ్యమైన కేంద్రాలైన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ (CST), లియొపోల్డ్ కేఫ్ వంటి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ ఉగ్రవాదులు కేవలం మారణకాండనే కాకుండా, హోటళ్లను స్వాధీనం చేసుకుని బందీలుగా ఉంచుకొని భద్రతా దళాలపై పోరాడారు. భద్రతా దళాల వీరోచిత పోరాటం ఫలితంగా కసబ్‌ను సజీవంగా పట్టుకోవడం జరిగింది, ఇది పాకిస్థాన్ ఉగ్రవాద పాత్రకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV