
ఢిల్లీ, 26 నవంబర్ (హి.స.)
భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రక మైలురాయిగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సాఫ్రాన్ (Safran) ఏర్పాటు చేసిన సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ప్రారంభించారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ – ఎస్ఈజెడ్లో సుమారు ₹1,300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 45,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ ఏరోస్పేస్ MRO (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సదుపాయం దేశీయంగా విమాన ఇంజిన్ల మరమ్మత్తు సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా 'ఆత్మనిర్భర్' భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంత పెద్ద పెట్టుబడి కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ పట్ల వారికున్న విశ్వాసానికి, కొనసాగుతున్న భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో తెలంగాణ వృద్ధికి ముఖ్యమైన మైలురాయి గా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రం 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, టెక్నీషియన్లకు ఉపాధిని కల్పిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచ ఏవియేషన్ సేవలకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న ఈ కీలక సమయంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజిన్ MRO సదుపాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడం, భారత ఇంజనీరింగ్ సామర్థ్యాలపై గ్లోబల్ OEM లకు (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్) ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని కొనియాడారు.
సాఫ్రాన్ ఛైర్మన్ రాస్ మెక్‌ఇన్నెస్ మాట్లాడుతూ.. తమ సంస్థ భారతదేశంతో 7 దశాబ్దాలుగా బలమైన రక్షణ సంబంధాలను కలిగి ఉందని పేర్కొన్నారు. మిరాజ్ 2000, రఫేల్ వంటి ఫైటర్ జెట్‌లకు సాఫ్రాన్ ఇంజిన్లు రక్షణగా నిలుస్తున్నాయి. HAL తో మా భాగస్వామ్యాలు చాలా విజయవంతమయ్యాయి. భవిష్యత్తులో HAL యొక్క మల్టీ రోల్ హెలికాప్టర్లు, HAL, సాఫ్రాన్ సంయుక్తంగా సహ-రూపకల్పన చేసి, సహ-అభివృద్ధి చేసిన 'అరవల్లి' ఇంజిన్లచే శక్తిని పొందనున్నాయని రాస్ మెక్‌ఇన్నెస్ వివరించారు. అంతేకాకుండా, చంద్రయాన్-3 మిషన్‌లో కూడా తమ కీలకమైన టెస్టింగ్, కమ్యూనికేషన్ పరికరాలను అందించినట్లు తెలిపారు. భారతదేశం- ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి లక్ష్యంతో ఈ బలమైన బంధం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం, రఫేల్ విమానాలకు శక్తినిచ్చే M88 ఇంజిన్‌కు ఫ్రాన్స్ వెలుపల మొట్టమొదటి MRO వర్క్‌షాప్‌కు కూడా శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV