
ఢిల్లీ, 29 నవంబర్ (హి.స.)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం డిసెంబర్ 4 నుండి 5 వరకు భారత్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటనను ధృవీకరించింది.‘‘ ఈ పర్యటన ఇరు దేశాల నాయకత్వానికి ప్రత్యేకం. విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అలాగే ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది’’అని తెలిపింది.
రక్షణ సహకారం – S400 క్షిపణి వ్యవస్థలు
ఈ శిఖరాగ్ర సమావేశంలో రక్షణ అంశాలు అజెండాలో ప్రముఖంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 వ్యవస్థ చాలా బాగా పనిచేశాయని రుజువు కావడంతో, భారత్ రష్యా నుంచి మరిన్ని S-400 వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తోంది. అయితే S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీలో ఆలస్యం జరుగుతోంది. ఈ జాప్యానికి గల కారణాలను, మిగిలిన డెలివరీలు ఎప్పుడు పూర్తవుతాయో రష్యాను అడుగుతామని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. కనీసం రెండు స్క్వాడ్రన్ల అత్యాధునిక Su-57 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే UH, సుఖోయ్ అప్‌గ్రేడేషన్ వంటి ఇతర ప్రధాన కార్యక్రమాలలో జాప్యాలను కూడా చర్చించి, వాటిని వేగవంతం చేయడానికి కృషి చేస్తామని సింగ్ తెలిపారు.
చమురు – ఉక్రెయిన్ వివాదం
పుతిన్ పర్యటనలో అంతర్జాతీయ అంశాలు కూడా కీలకంకానున్నాయి. అమెరికా ఆంక్షల తర్వాత భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించింది. అందుకే భారత్‌కు ముడి చమురు కొనడానికి రష్యా మరిన్ని డిస్కౌంట్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్ వివాదం త్వరగా ముగియాలని, శాశ్వత శాంతి నెలకొనాలని ప్రధాని మోదీ పదేపదే కోరుతున్నారు. ఈ యుద్ధాన్ని ఆపే శాంతి మార్గం గురించి కూడా మోదీ, పుతిన్ చర్చిస్తారు. ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో చర్చించి, వివాదాన్ని త్వరగా ముగించడానికి, శాశ్వత శాంతిని నెలకొల్పడానికి భారత్ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై పుతిన్, మోదీ మధ్య చర్చల్లో కీలక స్థానం లభించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV