
ఢిల్లీ, 6 డిసెంబర్ (హి.స.) విమానయాన సంస్థ ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. ఇండిగోలో నెలకొన్న నిర్వహన సంక్షోభం పరిష్కారం అంచున ఉందని, ఆ సంస్థపై చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలు నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయని ఇతర విమానయాన సంస్థలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పాటిస్తున్నాయన్నారు.
కేవలం ఇండిగో మాత్రమే సమస్యలు ఎదుర్కోవడం చూస్తే తప్పు పూర్తిగా ఆ సంస్థదేనని అర్థం అవుతోందని చెప్పారు. ఇతర సంస్థలకు లేని సమస్య ఇండిగోకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాబట్టి లోపం ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సమస్య దాదాపు పరిష్కారమైందని ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి మెట్రో విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తగ్గిందన్నారు. శనివారం నుండి ఇండిగో పాక్షిక సామర్థ్యంతో సేవలు ప్రారంభిస్తుందని చెప్పారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV