
బెంగళూరు, 29 నవంబర్ (హి.స.)
కర్ణాటకలో కొన్నాళ్ల నుంచి కాంగ్రెస్ సీఎం కోసం రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మార్పుపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరిగిన ‘బ్రేక్‌ఫాస్ట్’ భేటీ కాసేపటి క్రితం ముగిసింది.
అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. మా ఇద్దరినీ కేసీ వేణుగోపాల్ బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారని, గత నెల రోజులుగా ప్రజల్లో గందరగోళం నెలకొన్నదని అన్నారు. ముఖ్యమంత్రి మార్పు విషయం అధిష్టానం చేతి ఉందని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కలిసి పోరాడామో... ఇప్పుడు ఇద్దరం అలానే ఉన్నామని తెలిపారు. కావాలనే బీజేపీ, జేడీఎస్, మీడియా వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. 2028లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలిపారు. తమ ప్రభుత్వంపై అవిశ్వాసం అసాధ్యమని అన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. ఇక ముందు కూడా ఉండబోవని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ముఖ్యమని పేర్కొన్నారు. ఇద్దరం కలిసికట్టుగా బీజేపీపై పోరాడతామని సిద్ధరామయ్య ప్రకటించారు.
అనంతరం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తాము పార్టీకి నమ్మకమైన సైనికులమని అన్నారు. నాయకత్వ విషయంలో పార్టీ అధిష్ఠానం చెప్పిందే ఫైనల్ అని తెలిపారు. వారు ఏమి చెప్పినా అదే మా నిర్ణయమన కుండ బద్దలుకొట్టారు. దేశంలో పార్టీ కష్ట కాలం ఎదుర్కొంటోందనే విషయం తమకు తెలుసని అన్నారు. కానీ, కర్ణాటక 2028లో మళ్లీ అధికారంలోకి వచ్చి, 2029లో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతుందనే ఆత్మవిశ్వాసం తమకు ఉందన్నారు. గత ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తమకు భారీ మెజారిటీ ఇచ్చారని.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం తమ బాధ్యత అని డీకే శివకుమార్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV