
ఢిల్లీ, 30 నవంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్త FIR నమోదు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) మరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలను నిందితులుగా చేర్చింది. వారిలో శామ్ పిట్రోడా,మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అలాగే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. వీరంతా నేషనల్ హెరాల్డ్ పేపర్ మాతృసంస్థ అయిన ఏజేఎల్ ను మోసపూరితంగా చేజిక్కించుకునేందుకై క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ.
కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీగా చెప్పుకున్న డోటెక్స్ మర్చంటైజ్.. ఇద్దరు కాంగ్రెస్ నాయకులు 76శాతం వాటాను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ కు రూ.కోటి అందించిందని ఆరోపించారు. ఈ లావాదేవీలో యంగ్ ఇండియన్ కాంగ్రెస్కు రూ.50 లక్షలు చెల్లించి సుమారు రూ.2000 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్న ఏజేఎల్ పై నియంత్రణ సాధించిందన్న ఆరోపణలు ఉన్నాయి. యంగ్ ఇండియన్ లో వాటాలున్న ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్ గాంధీలేనని ఈడీ తెలిపింది. అక్టోబర్ 3న ఈడీ అందించిన ఇన్వెస్టిగేషన్ నివేదిక ఆధారంగా అక్టోబర్ 3న ఎఫ్ఐఆర్ దాఖలైంది. 2012లో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ తో ఈ కేసు మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV